NEWS

Budget 2024: వరుసగా ఏడు సార్లు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు..

Budget-2024- 25 భారతదేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెడుతుంటుంది. దీనిపై ఎన్నో ఆశలు అంచనాలు నెలకొంటాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి. రేపు (జులై 23న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దాంతో వరుసగా ఏడు ఫుల్‌టైమ్‌ బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా నిర్మలమ్మ రికార్డు క్రియేట్ చేయనున్నారు. 2019లో నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయినప్పుడు నిర్మల సీతారామన్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. దీంతో భారతదేశ చరిత్రలో పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె అరుదైన ఘనత సాధించారు. అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌తో కలిపి వరుసగా ఆరు బడ్జెట్లను సమర్పించారు. నిర్మలా సీతారామన్ రేపే 2024-25 ఆర్థిక సంవత్సరానికి (2024 ఏప్రిల్ - 2025 మార్చి) సంబంధించిన ఫుల్ బడ్జెట్‌ను రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీంతో నిర్మలమ్మ వరుసగా ఏడుసార్లు బడ్జెట్స్ ప్రవేశపెట్టినట్లు అవుతుంది. 1959-1964 మధ్య వరుసగా ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ రికార్డు నెలకొల్పారు. దానిని గతేడాదే నిర్మలమ్మ బ్రేక్ చేశారు. మరికొద్ది గంటల్లో ఆమె అత్యధికంగా వరుసగా 7 బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలుస్తారు. ఆమె రికార్డును ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేసే అవకాశం లేదు. ఈ సంవత్సరం రెండు బడ్జెట్లు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. దీంతో ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. జులై 23న ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ మోదీ 3.0లో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ అవుతుంది. * ముఖ్య విషయాలు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి కేంద్ర బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న దేశ తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టి (వరుస బడ్జెట్లు కాదు) రికార్డులకెక్కారు. ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, తరువాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వాల్లో ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ 10 బడ్జెట్లను ప్రజెంట్ చేశారు. మొరార్జీ దేశాయ్ మొదటి బడ్జెట్‌ను 1959, ఫిబ్రవరి 28న, ఆ తర్వాత రెండేళ్లలో ఫుల్ బడ్జెట్స్‌ను ప్రవేశపెట్టారు. 1962లో మధ్యంతర బడ్జెట్‌ను, తర్వాత మరో రెండు పూర్తిస్థాయి బడ్జెట్లను సమర్పించారు. 1967లో మరో మధ్యంతర బడ్జెట్‌ను, 1967, 1968, 1969ల్లో మూడు పూర్తిస్థాయి బడ్జెట్‌లు ఆవిష్కరించారు. మొత్తమ్మీద 10 బడ్జెట్లను రూపొందించారు. తొమ్మిది బడ్జెట్లు సమర్పించి అత్యధిక బడ్జెట్లను ప్రజెంట్ చేసిన రెండో మంత్రిగా పి. చిదంబరం నిలిచారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ఆయన తొలిసారిగా 1996 మార్చి 19న బడ్జెట్‌ను సమర్పించారు. 2004 నుంచి 2008 వరకు ఐదు బడ్జెట్లు సమర్పించారు. తర్వాత కేంద్ర హోం మంత్రిగా పనిచేసి, తిరిగి ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. 2013, 2014లో బడ్జెట్లు సమర్పించారు. ఆయన తర్వాత ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లను సమర్పించారు. 2009-2012 మధ్య వరుసగా ఐదు ఆవిష్కరించారు. మన్మోహన్ సింగ్ 1991-1995 మధ్య వరుసగా ఐదు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. * బడ్జెట్ ప్రసంగం అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ పేరిటే ఉంది. 2020, ఫిబ్రవరి 1న ఆమె ప్రసంగం రెండు గంటల 40 నిమిషాల పాటు కొనసాగింది. ఆరోగ్యం బాగోలేక రెండు పేజీలు మిగిలి ఉండగానే ఆమె ఆ ప్రసంగం ముగించింది. మరోవైపు అతి చిన్న బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ రికార్డు క్రియేట్ చేశారు. 1977లో మధ్యంతర బడ్జెట్ సమయంలో ఆయన 800 పదాలు మాత్రమే మాట్లాడారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.