NEWS

ఆ ఊరు ఊరంతా పూల తోటల సాగు..

flower crops గ్రామాల్లో వరివారు, పత్తి పంటలతో పాటు రైతులు ఎక్కువగా పూల సాగు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. పూలతో జీవనం కొనసాగించే రైతులు పూల పండుగల్లోనూ లాభాలు రాకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పూల సాగు ద్వారా ఆదాయం గణనీయంగా తగ్గిందని వారు చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పూల మార్కెట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పై రైతులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. పూల అమ్మకాల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఇది ఎంతో అవసరమని చెప్పుతున్నారు. కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామంలో రైతులు వాణిజ్య పంటలతో పాటు చిరు పంటలైన పూలను పండిస్తూ కొన్ని సంవత్సరాలుగా లాభాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల్లో పూలకు అధిక డిమాండ్ ఉంటుందని ఆశించినా, ఈ ఏడాది ఆశించినంత ఆదాయం రాకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. బంతి పూల నుంచి తక్కువ ఆదాయం రావడంతో పంట మార్పిడి వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు. దీపావళి నేపథ్యంలో చామంతి పంటను కూడా వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే పూలను మార్కెట్లో అమ్ముకోవడానికి సరైన వసతులు లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని వారు వాపోతున్నారు. జిల్లాలో కాకపోయినా, ఉమ్మడి జిల్లా కేంద్రంలో అయినా పూల మార్కెట్ ఏర్పాటు చేస్తే అమ్మకాలు మెరుగ్గా సాగుతాయని రైతు సాసాల రాజిరెడ్డి అన్నారు. పూలను విక్రయించడం ఒకటి అయితే, తెగుళ్ల ప్రభావం మరో ప్రధాన సమస్యగా మారిందని రైతులు గోస పుడుతున్నారు. తెగుళ్ల కారణంగా పంట దిగుబడి తగ్గిపోతోందని, సమస్యను నివారించే సరైన మందులు సూచించాలని వ్యవసాయ అధికారులను కోరుతున్నారు. అలాగే, అధికారులు గ్రామాన్ని సందర్శించి పూల వ్యాపారం, రసాయనాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. చామంతి, బంతి పూల మొక్కలు చిత్తూరు, నెల్లూరు, గుంటూరు ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నామని రైతులు తెలిపారు. గతేడాది బంతిపూలకు కిలోకు 50 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ధర లభించిందని, అయితే ప్రస్తుతం 30 నుంచి 70 రూపాయల మధ్య మాత్రమే అమ్మకాలు సాగుతున్నాయని చెప్పారు. రైతులు పూల సాగును లాభదాయకంగా మార్చుకోవాలంటే ప్రభుత్వం పూల మార్కెట్ ఏర్పాటు చేయడం అనివార్యమని వారు అభిప్రాయపడుతున్నారు. పూల తోటల సాగుదారులు మార్కెట్ సదుపాయం కల్పిస్తే తమ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.