NEWS

Viral: కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్తే.. కేజీ జిలేబీ తీసుకురాలని అడిగారు! ఎందుకంటే?

PC : X Viral: సాధారణంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే, కేసు పరిష్కారానికి లంచంగా డబ్బులు డిమాండ్ చేసే పోలీసులు ఉంటారు. అప్పుడప్పుడు కాఫీలు, టిఫిన్స్ సైతం తెప్పించుకుంటారు. యూపీలోని బహదూర్‌గఢ్ పోలీసులు మాత్రం చాలా వెరైటీ కోరిక కోరారు. బాధితుడి ఫిర్యాదును నమోదు చేసుకోవాలంటే ముందు కేజీ జిలేబీ లేదా బలుషాహి (ఉత్తరభారతం స్వీట్) తీసుకురావాలని ఆదేశించారు. విలువైన వస్తువు కనపడకపోతే ఎవరైనా వెతకడం సహజం. అప్పటికీ దొరక్కపోతే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేస్తాం. యూపీలోని కనౌర్ గ్రామానికి చెందిన చంచల్ కుమార్ అనే యువకుడు అదే చేశాడు. గత శనివారం మందులు కొనుగోలు చేయడానికి మెడికల్ షాప్‌కు వెళ్లాడు. బిల్లు ఫోన్‌పే చేయడానికి మొబైల్ కోసం జేబులో చెయ్యి పెట్టాడు. అయితే ఫోన్ కనబడలేదు. దారిలో పడిపోయిందేమోనని వచ్చిన దారిలో వెతుక్కుంటూ ఇంటికి చేరాడు. ఇంట్లో వెతికినా ఫోన్ దొరకలేదు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. ఎలాగైనా ఫోన్‌ను కనిపెట్టాలని పోలీసులను కోరాడు. కిలో స్వీట్స్ తెస్తేనే కేసు నమోదు స్టేషన్‌లో పోలీసుల ప్రవర్తన చూసి చంచల్ కుమార్ షాక్ అయ్యాడు. ఫిర్యాదును పరిష్కరించాల్సిన పోలీసుల చిల్లర ప్రవర్తన అతనికి చికాకు తెప్పించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలంటే కేజీ జిలేబీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు ఆలోచించి, తనకు ఫోన్ దొరకడం ముఖ్యమని అనుకుని పోలీసులు చెప్పినట్లు కేజీ జిలేబీ తీసుకొచ్చాడు. తర్వాత ఈ విషయం బయటకు రావడంతో అధికారులు ఫైర్ అవుతున్నారు. కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా, బాధితునితో జిలేబీ తెప్పించుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. లంచంగా బంగాళదుంపలు ఇలాంటి మరో ఘటన యూపీలో గత నెల ప్రారంభంలో ఒకటి చోటుచేసుకుంది. ఓ కేసులో భాగంగా పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రామ్ కృపాల్ సింగ్ లంచంగా బంగాళదుంపలు డిమాండ్ చేశాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతన్ని సస్పెండ్ చేశారు. అయితే బంగాళదుంప అనే పదాన్ని లంచానికి కోడ్‌గా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. రామ్ కృపాల్ సింగ్ కేసును పరిష్కరించేందుకు లంచంగా బంగాళదుంపలు అంటే కోడ్ లాంగ్వేజ్‌లో లంచం డిమాండ్ చేశాడు. అందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లంచంగా కూలర్ ఈ ఘటన మరవకముందే కూలర్‌ను లంచంగా డిమాండ్ చేసినందుకు మరో పోలీసు అధికారి యూపీలో సస్పెండ్ అయ్యాడు. మనీష్ కుమార్ ప్రజాపతి అనే పోలీస్ అధికారి తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఒక కేసు పరిష్కారం కోసం లంచంగా కూలర్‌తో పాటు రూ.6,000 తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి అతన్ని సస్పెండ్ చేశారు. కాగా, బహదూర్‌గఢ్ పోలీసులు చంచల్ కుమార్ నుంచి కేజీ జిలేబీ తెప్పించుకున్న ఘటన వైరల్‌గా మారింది. ఇది పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లితే విచారణ జరిపి సదరు పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం లేకపోలేదు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.