NEWS

ఇక్కడ ప్రసాదం కోసం క్యూ కడుతున్నారు.. ఇంతకు స్పెషల్ ఏంటంటే ?

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు నోములు వ్రతాలతో సందడిగా మారతాయి. లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. లక్ష్మీమహావిష్ణువులకు ప్రీతిపాత్రమైన ఈ నెల శుభకార్యాలు నిర్వహించేందుకు అనువైందిగా భావిస్తారు. అయితే ఈ శ్రావణ మాసం లో వచ్చే తొలి పండుగను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. నాగుల పంచమి అన్ని శుభకార్యాలకు మంచిరోజుగా భావిస్తారు. అందుకే ఉదయం నుండి పాముల పుట్టల వద్దకు మహిళలు మంగళ హారతులతో తరలివెళ్లి పుట్టలో పాలు పోసి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పాములు పుట్టలు లేని చోట కృత్రిమంగా ఏర్పాటు చేసిన పుట్టల వద్ద పూజలు చేశారు. ఏ పుట్ట వద్ద చూసినా భక్తుల కోలాహాలమే కనిపించింది. పుట్టలో పాలు పోయడంతోపాటు కొందరు భక్తులు తమ తమ తాహతుకు తగ్గట్టు బంగారు, వెండి, రాగి పాముల ప్రతిమలను పుట్టలో జారవిడిచి పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. పిల్లా పాపలతో కలిసి వెళ్లి ఆ నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు పోసిన అనంతరం మహిళలు పరస్పరం వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. నాగుల పంచమి శుభప్రదమైనదని, తరాల నుండి వస్తున్న ఆచారం ప్రకారం పుట్టలోని నాగేంద్రుడికి పాలతో అభిషేకం చేస్తున్నామని భక్తులు పేర్కొన్నారు. ఇది ఆ దైవానికి కృతజ్ఞాతపూర్వకంగా జరిపే తంతన్నారు. ఈ నాగుల పంచమి రోజున నాగేంద్రుడిని పాలతో అభిషేకిస్తే ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో, సుఖఃశాంతులతో ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా కొలువున్న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో గిరిజనులు తమ సంప్రదాయబద్దంగా నాగుల పంచమి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేస్లాపూర్ లోని నాగోబా క్షేత్రం భక్త జన సంద్రంగా మారింది. గిరిజనులు సంప్రదాయ పూజల అనంతరం జొన్న గట్కతో తయారు చేసిన వంటకాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. నాగుల పంచమి సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి గిరిజనులు కేస్లాపూర్ కు తరలివచ్చి తమ ఇలవేల్పు నాగోబాను దర్శించుకున్నారు. మొత్తంమీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. అటు ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడిపోయాయి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.