NEWS

తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై.. టీటీడీ చర్యలకు సిద్ధం..

తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై టీటీడీ చర్యలకు సిద్దం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని కాపాడేందుకు టీటీడీ అనేక చర్యలు తీసుకుంటూ వస్తుంది. తిరుమల పవిత్రతను, భక్తుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన జరిగిన మొదటి పాలకమండలి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలకు చైర్మన్ తో సహా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. టీటీడీ ఆ నిర్ణయాలను తిరుమలలో కఠినంగా అమలు చేస్తున్న రాజకీయ నాయకులు మాత్రం మాకేం కాదు అనే రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ తెలంగాణ మాజీ మంత్రి తీరు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది. నిత్యం శ్రీవారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశ- విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే కొందరు వి.ఐ.పి., వి.వి.ఐ.పి. పరిధిలోని ప్రజాప్రతినిధులకు, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తులకు సందర్భానుసారం దర్శన సదుపాయం కల్పిస్తుంది టీటీడీ. గత కొన్నాళ్లుగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులకు బ్రేక్ దర్శనం టికెట్లు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి కోవిడ్-19 ఉపద్రవం ఉద్భవించిన అనంతరం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాల సదుపాయాన్ని రద్దు చేసింది టీటీడీ. అప్పటి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సును తిరస్కరిస్తూ వస్తుంది టీటీడీ. ఈ అంశం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో టీటీడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం నడుచుకునే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు తిరుమలలో రాజకీయాలు మాట్లాడరాదనే నియమాన్ని విస్మరించి రాజకీయ ప్రస్తావనలకు దిగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం ఎందుకు కల్పించరు అనే విధంగా ఆలయం ముందే టీటీడీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. విన్నతులు ఇవ్వాల్సిన ప్రదేశంలో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. శ్రీవారిని మాజీ తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం నాడు దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఆయన పరివారాన్ని శ్రీవారి దర్శనార్థం తిరుమలకు తీసుకొచ్చారు. అదే సమయంలో ఆయన కోరినన్ని గదులు కేటాయించలేదని సీరియస్ అయ్యారు. శ్రీవారి దర్శనం అనంతరం తిరుమలలో రాజకీయాలు మాట్లాడరాదనే నియమాన్ని పక్కనపెట్టి…. రాజకీయ ప్రస్తావనకు తెరలేపారు. తెలంగాణ రాష్ట్రంగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలుగా కలిసి ఉన్నామని చెప్పడంతో ఆపకుండా టీటీడీపై విమర్శల వర్షాన్ని కురిపించారు. ఇక తెలంగాణను ఏపీని కలిపే ఏకైక ప్రదేశం తిరుమల అని తెలిపారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు, తెలంగాణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. ఇదేం పద్ధతి… ఈ పద్ధతి మంచిది కాదు అంటూ ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎక్కడా బేధాలు చూపించలేదని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకున్న…. ఆంధ్ర వ్యాపారస్తులే ఎక్కువ లాభపడ్డారని విమర్శించారు. గదులు అడిగిన పట్టించుకునే వారే లేరు అన్నట్లు మాట్లాడారు. ఈ పద్ధతిని సరి చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ అంటే అపారమైన గౌరవం ఉంది… ఆ గౌరవాన్ని టీటీడీ కాపాడుకోవాలి అనే ధోరణిలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి ఐదు మంది టీటీడీ బోర్డు సభ్యులు ఉన్న ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ తెలంగాణలో ఉన్న మాకు ఒరిగేది ఏమీ లేదన్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని టీటీడీ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశాన్ని టీటీడీ చైర్మన్ సైతం సీరియస్ అయ్యారట. తిరుమలలో నిబంధనలు తుంగలో తొక్కి రాజకీయ, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుమలశ్రీవారి ఆలయం ముందు తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను చైర్మన్ ఖండించారు. శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్‌ను ఆదేశించారు. ప్రశాంతతను దెబ్బతీసేలా తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పవిత్రతను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పాలకమండలి తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని బి.ఆర్. నాయుడు హెచ్చరించారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.